జాతీయం: భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) పదవికి జ్ఞానేశ్ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, కొత్త ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఈ నియామకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేసిన తర్వాత అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా ఉన్న రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నియామకాలను చేపట్టింది. సంప్రదాయ ప్రకారం, ఎన్నికల కమిషనర్ ప్యానెల్‌లో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతుంటారు. అదే ప్రకారం, ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్ ఇప్పుడు సీఈసీ బాధ్యతలు చేపట్టనున్నారు.
జ్ఞానేశ్ కుమార్ ప్రస్థానం
కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్ గత ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. 2019లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ప్రవేశపెట్టిన చట్ట బిల్లును రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆ సమయంలో కేంద్ర హోంశాఖలో కశ్మీర్ డివిజన్ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన జ్ఞానేశ్ కుమార్, ఆ తర్వాత కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2024 జనవరిలో ఆయన ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు. హోంమంత్రి అమిత్ షాకు ఆయన సన్నిహితుడిగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల నిర్వహణలో కీలక భాద్యతలు
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, 2025లో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఆయన నేతృత్వంలో జరుగుతాయి.
కేంద్ర ప్రభుత్వం 2023లో తెచ్చిన కొత్త చట్టం ప్రకారం, ఇది తొలి సీఈసీ నియామకంగా నిలవడం విశేషం. అయితే, ఈ నియామకం చట్టబద్ధతపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసుపై ఈ నెల 19న విచారణ జరగనుంది.
త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కొత్త సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాలని సూచించినట్లు సమాచారం. కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించడంతో జ్ఞానేశ్ కుమార్ భారత ఎన్నికల కమిషన్ కొత్త అధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.