ఎన్నికల ఫలితాల అప్డేట్ – మహారాష్ట్రలో బీజేపీ హవా, జార్ఖండ్‌లో హోరాహోరీ
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి (మహాయుతి) భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి ఫలితాల ప్రకారం, 145 మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఫడ్నవీస్ మళ్లీ సీఎం?
బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించనున్నట్లు బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే ఫడ్నవీస్‌తో భేటీకి సిద్దమవుతున్నారు.
తోలి విజయం బీజేపీకే
మహారాష్ట్రలో వడాల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కాళిదాస్ నీలకంఠ్ తొలి విజయం సాధించారు. 59,764 ఓట్ల మెజార్టీతో బీజేపీ ఖాతా తెరిచారు. పలు ప్రాంతాల్లో బీజేపీ భారీ ఆధిక్యంలో ఉంది.
శివసేన ఆరోపణలు
శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. ఎన్డీఏ నేతలపై ప్రజల్లో ఆగ్రహం ఉన్నా, ఫలితాలు వారి అనుకూలంగా రావడం విమర్శలకు తావిచ్చింది.
జార్ఖండ్‌లో హోరాహోరీ
జార్ఖండ్‌లో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ఉత్కంఠభరిత పోటీ సాగుతోంది. 81 స్థానాలకు గానూ ఎన్డీఏ 30, ఇండియా కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఉప ఎన్నికల హంగామా
ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 9 స్థానాలకుగానూ బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యంలో ఉండగా, కర్ణాటకలో కాంగ్రెస్ రెండు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉంది.
ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రభావం
మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన బల్లాపూర్, డెగ్లూరు, షోలాపూర్ వంటి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. లాతూర్‌లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్ ఆధిక్యంలో ఉన్నారు.
ప్రియాంక గాంధీ సత్తా
వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ 2.09 లక్షల ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. రాహుల్ గాంధీ రాజీనామా చేసిన స్థానం నుంచి ఆమె భారీ విజయాన్ని అందుకోనున్నారు.
ఎంఐఎం గెలుపు ఆశలు
మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ అనేక స్థానాలలో పోటీ చేసినా.. ఔరంగాబాద్ ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రం ఆధిక్యంలో ఉంది. ఇంతియాజ్ జలీల్ శివసేన అభ్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికలు – చరిత్రాత్మక విజయావకాశం
మొత్తం 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. మహాయుతి కూటమి 222 స్థానాల్లో ముందంజలో ఉంది. మహావికాస్ అఘాడీ కేవలం 70 స్థానాల్లో ఆధిక్యం సాధించింది.