భువనేశ్వర్: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై ఏకంగా 15% డిస్కౌంట్ అందించబోతున్నట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఒడిశా రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2021 ప్రకారం తమ రాష్ట్రం తమ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.
ఆ రాష్ట్రంలో అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాలకు వాహనం ఎక్స్ షో రూమ్ ధర మీద 15% లేదా రూ.5,000 వరకు, త్రిచక్ర వాహనాలకు రూ.10,000, నాలుగు చక్రాల వాహనాలకు రూ.50,000 వరకు సబ్సిడీలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలోని ఆర్డీవో కార్యాలయాల ద్వారా ఎలెక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తం క్రెడిట్ చేయనున్నట్లు తెలిపింది. కాగా రాష్ట్రంలో ఈ పథకం డిసెంబర్ 31, 2025 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు మరియు కొనుగోలు ప్రోత్సాహకాల క్రెడిట్, ఈవీ కొనుగోళ్ల రుణ సబ్సిడీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయడానికి ఎన్ఐసి లేదా ఒసీఏసీ సహాయంతో రవాణా కమిషనర్ ఒక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.