న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల మార్కెట్‌కి మరింత జోష్ ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. దీనిలో భాగంగా ఈ-వెహికల్ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెండింతలకు పెంచింది. ఈ సబ్సిడి పెంపు వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ నుండి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈవీ వెహికల్స్ తయారీకి సంబంధించి కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాల తయారీ ధరలో ఇంతవరకు 20 శాతంగా ఉన్న సబ్సిడీని రెట్టింపు అంటే 40 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ. 15,000 సబ్సిడీ లభిస్తోంది. అలాగే 2 కిలోవాట్ పర్ అవర్ బైక్‌పై రూ. రూ. 30,000 సబ్సిడీ 3 కిలోవాట్ పర్ అవర్ బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది.
అయితే ఈ సబ్సిడీ లక్షన్నర ధర మించని బైకులకు వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ-వెహికల్స్‌పై సబ్సిడీని ఒకేసారి 50 శాతానికి పైగా పెంపుదల చేయడంతో అథర్ ఇ-వెహికల్స్ తయారీ సంస్థ తన స్కూటర్ల ధరలను వెంటనే తగ్గించింది. అథర్ 450ఎక్స్ మోడల్‌పై రూ. 14,500 ధర తగ్గిస్తున్నట్టు ప్రకటన చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈవీ అమ్మకాలు జోరందుకుంటాయని అథర్ ఫౌండర్ తరుణ్ మెహతా ఆశాభావం వ్యక్తం చేశారు.
రివోల్ట్ మోటార్స్ ఈ నిర్ణయాన్ని ఒక గేమ్ ఛేంజర్‌గా ప్రకటించింది. ప్రస్తుతం మరిన్ని ఈ-వెహికల్ తయారీ కంపెనీలు తమ వాహనాల ధరలు తగ్గించే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లో మైలేజ్, ఛార్జింగ్ పరంగా 2 క్వ్హ్ సామార్థ్యం ఉన్న బైకులు పెట్రోలు బైకులకు ప్రత్యామ్నయంగా ఉన్నాయి. కానీ ఈ-వాహనాల ధరల విషయంలో పోల్చినప్పుడు పెట్రోలు బైకుల కంటే ఈవీ బైకుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో కష్టమర్ల నుంచి ఆశించిన మేరకు డిమాండ్ రావడం లేదు.
ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన సబ్సిడీ సమాచారం ద్వారా వెహికల్స్ ధర తగ్గించి, డిమాండ్ పెంచే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. ఈ-వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా ఫేమ్ 2లో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. దీని కోసం కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది.