అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి – ముగ్గురు భక్తుల మృతి
శివరాత్రి పర్యటన విషాదంలోకి
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు శేషాచలం అడవుల్లో గుండాలకోనకు పాదయాత్రగా వెళ్తుండగా, ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృత్యువాత పడగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏనుగుల దాడి ఎలా జరిగింది?
సోమవారం రాత్రి 14 మంది భక్తులు ఓబులవారిపల్లె మండలం గుండాలకోన అటవీ మార్గం గుండా కాలినడకన ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అడవి నుంచి ఏనుగుల గుంపు అకస్మాత్తుగా వారి మీదకు దూసుకొచ్చి దాడి చేయడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. కానీ ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను చంగల్ రాయుడు, తుపాకుల మణెమ్మ, దినేష్ గా గుర్తించారు.
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను రైల్వేకోడూరు ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ చర్యలు – కుంకీ ఏనుగుల వినియోగంపై దృష్టి
ఏనుగుల దాడులను నివారించేందుకు ఏపీ ప్రభుత్వం గతంలోనే కుంకీ ఏనుగులను వినియోగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో అటవీ శాఖ చర్యలు ముమ్మరం చేసే వకాశం ఉంది.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.