టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, మెటా ఎల్ఎల్ఏఎంఏ లాంటి ఏఐ మోడళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రేసులో ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ కూడా తనదైన ముద్ర వేయాలని చూస్తోంది.
ఇప్పటికే ఎక్స్ఏఐ గ్రోక్ ఏఐ మోడల్‌ను విడుదల చేసింది. ఇది ‘ఎక్స్’ (ట్విట్టర్) లో అందుబాటులో ఉంది. తాజాగా, మరింత అభివృద్ధి చేసిన గ్రోక్ 3ను ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ కొత్త వర్షన్ మరింత శక్తివంతమైనదిగా, తెలివైనదిగా ఉంటుందని మస్క్ తెలిపారు.
గ్రోక్ 3 ఫిబ్రవరి 13 ఉదయం 9.30 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ మరింత మెరుగైన సహాయాన్ని అందించడంతో పాటు యూజర్ ఇన్పుట్‌లకు తక్షణ స్పందన ఇవ్వనుంది. మస్క్ ప్రకారం, ఇది భూమ్మీద ఉన్న ఇతర ఏఐ మోడళ్లకంటే మెరుగైనదిగా ఉండనుంది.
సరికొత్తగా, గ్రోక్ 3లో టెక్స్ట్-టు-వీడియో ఫీచర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అంటే, వాస్తవిక డేటా ఆధారంగా ఏఐ వీడియోలు రూపొందించగల సామర్థ్యం ఇందులో ఉంది.
ఈ అప్‌డేట్‌తో ఏఐ రేసు మరింత ఆసక్తికరంగా మారనుంది. గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలకు గ్రోక్ 3 గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.