వాషింగ్టన్: మన జీవితంలో ఏదో ఒక్క క్షణం చాలు మన జీవితాన్ని తలక్రిందులు చేయడానికి. అతి ముఖ్యంగా ఈ మాట స్టాక్ మార్కెట్ లలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు ఎలాన్ మస్క్ ట్విట్టర్లో చేసిన కొన్ని ట్వీట్ల వల్ల స్టాక్ మార్కెట్ ద్వారా కొన్ని లక్షల కోట్లు నష్టపోయాడు.
అలాంటిదే తాజాగా మరోసారి తాను చేసిన ఒక్క ట్వీట్‌తో మరో లక్ష కోట్ల వరకు నష్ట పోయాడు. ఈ మధ్య బిట్ కాయిన్ విలువ రాకెట్ వేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే, బిట్ కాయిన్ షేర్ విలువ పెరుగుతుండడంపై ట్విటర్ లో ఎలాన్ మస్క్ స్పందించారు. “బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా” కనిపిస్తోందని ఫిబ్రవరి 20న ట్వీట్ చేశారు.
కాగా టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లందరూ క్యూ కట్టారు. ఈ ఒక్క ట్వీట్ తో 15.2 బిలియన్ డాలర్లు (అంటే సుమారు లక్ష కోట్లు)కోల్పోయాడు. టెస్లా సంస్థ ఈక్విటీ విలువ కూడా దీనివల్ల పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసాడు. అయితే ఎలాన్ కు ఇలా కోట్లు నష్టపోవడం మొదటిసారి కాదు, గతంలో కూడా “టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువ” అంటూ చేసిన ట్విట్ కి 14 బిలియన్ డాలర్లు నష్టపోయాడు.