టోక్యో: కరోనా వైరస్ ప్రబలి ఏడాది దాటి పోయినా అది మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ తగ్గక పోగా ఈ వైరస్ కొత్త రూపాల్లో వెలుగు చూడడం ప్రపంచ దేశాలను కలవరం రేపుతోంది. నిన్న మొన్నటి దాకా బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వైరస్ కొత్త వెర్షన్‌లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా జపాన్ దేశంలోనూ ఈ వైరస్ రూపం మార్చుకుని దాడి చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇప్పుడు జపాన్‌లో కలకలం రేగింది.
జపాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల వైరస్ కన్నా చాలా భిన్నంగా ఉందని జపాన్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ వైరస్‌ను బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో కనుగొన్నట్లు వివరణ ఇచ్చింది. ఈ ఇద్దరికి మొదట ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. కాగా కొన్ని రోజులకు వీరిలో ఒకరికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడడంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరీక్షలు చేయగా ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని నిర్ధారించారు.
తరువాత రెండో వ్యక్తికి జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమై వారికి ప్రత్యేక వైద్యం అందిస్తోంది. ఈ వైరస్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని శాస్త్రవేత్తలు, వైద్యులను జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. జపాన్‌లో ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం వైరస్ కేసులు 30 వరకు ఉన్నాయి. 80 వేల కేసులు నమోదవగా, 4 వేల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
ఈ కేసులు అత్యధికంగా దేశ రాజధాని టోక్యోలో నమోదవుతుండడంతో అత్యవసర పరిస్థితి విధించారు. దీని ప్రభావం ఒలంపిక్స్ గేమ్స్‌పై పడే అవకాశం ఉందని, క్రీడా సంబరాలను వాయిదా లేక రద్దు చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.