హైదరాబాద్: రాష్ట్రంలో ఇంకా ఎంసెట్ జరగనేలేదు, 10 రోజులలో జరగనున్న ఎంసెట్ కరోనా వల్ల జరుగుతుందో లేదో గ్యారంటీ కూడా లేదు. కానీ రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పటికే సగానికి పైగా యాజమాన్య కోట సీట్ల భర్తీని చేసేశాయి.
ఏ కాలేజీలో ఎంసెట్ కటాఫ్ ఎలా ఉంటుందో తెలియకున్నా అధిక మొత్తంలో డొనేషన్లు దండుకునేందుకు యాజమాన్య కోటా సీట్లను వేలానికి పెట్టేసాయి. కరోనా నేపథ్యంలో కళాశాలలన్నీ మూతపడినప్పటికీ లోపల లోపలే బోధన, బోధనేతర సిబ్బందితో మేనేజ్‌మెంట్ సీట్లను భర్తీ చేసేందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
ఇప్పటికే పలు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని బ్రాంచుల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నింటినీ నింపేశాయి. మరో పది రోజుల్లో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానుండగా, ఆలోపే సీట్లన్నీ భర్తీ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ పాటికే తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు మెసేజులు కూడా పంపుతున్నాయి.
ఇంజనీరింగ్‌లో ప్రస్తుతం సీఎస్‌ఈ, ఈసీఈ , ఐటీ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. సీఎస్‌ఈ బ్రాంచ్ కోటాలో ఉన్న మేనేజ్‌మెంట్ సీట్లు టాప్ కాలేజీల్లో ఇప్పటికే భర్తీ అయ్యాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ కోర్సుల్లో అడ్మిషన్ కోసం వచ్చే విద్యార్థులపై యాజమాన్యలు డొనేషన్ల పేరిట భారీగా గుంజుతున్నాయి. ఒక్కో సీటుకు సగటున రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.
టాప్ కాలేజీలుగా పేరున్న వాటిలో రూ. 10 లక్షలకు తక్కువ డొనేషన్ లేదు. డొనేషన్‌తోపాటు రెగ్యులర్ ట్యూషన్ ఫీజును ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చెల్లించాలి. ఈసారి కొత్తగా సీఎస్‌ఈలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ (డీఎస్), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కేటగిరీలకు డిమాండ్ అధికంగా ఉంది.