కార్డీఫ్: కార్డీఫ్ వేదికగా జరిగిన తొలి ఓడీఐ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, ఇంగ్లండ్ పేసర్ షకీబ్ మహమూద్ దెబ్బకు 141 పరుగులకే ఆలౌట్ అయింది. తరువాత 142 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది.
మరో ఓపెనర్ డేవిడ్ మలన్ (68), జాక్ క్రాలే (58) అజేయంగా అర్ధ సెంచరీలు సాధించడంతో కేవలం 21.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా సాధించింది. జాక్ క్రాలే అరంగేట్ర మ్యాచ్ లోనే ఆర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఫాస్ట్ బౌలర్ షకీబ్ మహమూద్ సహాయంతో ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 141 పరుగులకే పాకిస్థాన్‌ను కట్టడి చేసింది.
బౌలింగ్ లో షకీబ్ 42 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షకీబ్ మహమూద్తో పాటు లూయిస్ గ్రెగొరీ, మాట్ పార్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తొలి వన్డే కు ముందు ఇంగ్లాండ్ ప్రధాన ఆటగాళ్లు కొంత మంది కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు.
దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 15 మంది ఆటగాళ్లుతో కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్‌కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది.