చెన్నై: చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని చూపించింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 89.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల మాత్రమే కోల్పోయి 263 పరుగుల వద్ద నిలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 128 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నాడు. కాగా సెంచరీకి 13 పరుగుల దూరంలో ఓపెనర్ డొమినిక్ సిబ్లి 87 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
జో రూట్ మరియు సిబ్లీ మధ్య 390 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నమోదయ్యింది. రూట్ తన 100వ టెస్టు మ్యాచ్‌లో 20వ సెంచరీ చేయడం తొలిరోజు ఆటలో హైలెట్. తొలిరోజు ఆటలో సింహభాగం ఇంగ్లండ్ జట్టు తన ఆధిపత్యం ప్రదర్శించింది. భారత బౌలర్లు రోజంతా కష్టపడినా మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశాడు.
టెస్టుల్లో 20వ సెంచరీ సాధించడంతో పాటు 100వ టెస్టులో సెంచరీ సాధించిన ఆటగాడిగా, అటు కెప్టెన్‌గా రూట్ అరుదైన ఘనతను పొందాడు. లంచ్ విరామానికి ముందు రెండు ఓవర్ల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ డెమినిక్ సిబ్లీ (178 బంతుల్లో 53; 7 ఫోర్లు) జో రూట్ (95 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు.
ఇంగ్లండ్ 63 పరుగుల వద్ద తమ ఓపెనర్ బర్న్స్ ని కోల్పోయింది, వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన డానియల్ లారెన్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి బర్న్స్ పెవిలియన్ చేరాడు. ఇక లారెన్స్, బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా బుమ్రాకు స్వదేశంలో ఇదే తొలి టెస్టు వికెట్ కావడం విశేషం.