జాతీయం: ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్: పేరు మార్పు, అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సులభతరం
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) చందాదారులకు శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాదారులు పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకోవడాన్ని మరింత సులభతరం చేస్తూ కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇకపై యజమాని లేదా ఈపీఎఫ్‌ఓ ఆమోదం అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఈ మార్పులను పూర్తిచేసుకునే అవకాశం కల్పించింది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ఈ కొత్త సేవలను ప్రారంభించారు. పీఎఫ్ ఖాతాదారులు ఇ-కేవైసీ పూర్తి చేస్తే యజమాని జోక్యం లేకుండా ఖాతాలను ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
వ్యక్తిగత వివరాల మార్పు సులభతరం
పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత వంటి వివరాల్లో సాధారణంగా జరిగే తప్పులను సరిదిద్దుకోవడాన్ని ఈపీఎఫ్‌ఓ ఎంతో సులభతరం చేసింది. 2017 అక్టోబర్ 1 తర్వాత జారీ అయిన యూఏఎన్ నెంబర్లకు సంబంధించిన మార్పులకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు. ఇకపోతే, 2017 ముందు జారీ అయిన యూఏఎన్ నంబర్లలో మార్పులకు యజమాని ద్వారానే దరఖాస్తు చేయాలి.
ఆధార్‌తో లింక్ అవసరం
ఆధార్‌తో లింక్ కాని యూఏఎన్ ఖాతాల కోసం ఫిజికల్ డాక్యుమెంట్ల సమర్పణ అవసరమవుతుంది. యజమాని ద్వారా వెరిఫికేషన్ పూర్తయ్యాక ఈపీఎఫ్‌ఓ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది.
జాయింట్ డిక్లరేషన్ తొలగింపు
ముందుగా, పీఎఫ్ ఖాతాదారులు తమ వివరాలను సరిదిద్దుకోవడానికి జాయింట్ డిక్లరేషన్ ద్వారా డాక్యుమెంట్లు సమర్పించాలి. దీనికి యజమాని ఆమోదం తీసుకోవాల్సి వచ్చేది. కానీ, తాజా మార్పులతో ఈ ప్రక్రియ పూర్తిగా తొలగించబడింది.
ఉద్యోగ మార్పులకు ప్రత్యేక సదుపాయం
ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతా ట్రాన్స్‌ఫర్ చేయడం ఇప్పుడు మరింత సులభం. ఇ-కేవైసీ పూర్తి చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ ద్వారా ఖాతాను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
వేగవంతమైన సేవలు
ఈపీఎఫ్ ఖాతా ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ సగటున 12-13 రోజులు పడుతోందని మంత్రి మాండవీయ తెలిపారు. తాజా నిర్ణయంతో ఈ గడువు తగ్గి, సేవలు మరింత వేగవంతమవుతాయని పేర్కొన్నారు.
పీఎఫ్ సేవలతో సమానంగా బ్యాంకింగ్ సేవలు
ఈపీఎఫ్‌ఓ సేవలను బ్యాంకింగ్ స్థాయికి చేర్చేందుకు కేంద్ర కార్మిక శాఖ అనేక చర్యలు చేపడుతోంది. యజమానులపై పని ఒత్తిడి తగ్గించడంతో పాటు, చందాదారులకు మరింత అనుకూలంగా సేవలను అందించడమే లక్ష్యమని మంత్రి స్పష్టంచేశారు.