అమరావతి: ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలాడే నకిలీ ఔషధాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కఠినమైన నిబంధనలు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డ్రగ్ కంట్రోల్‌పై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ అండ్ కాపీరైట్ రవిశంకర్ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మార్కెట్‌లో చలామణి అవుతున్న నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ లో 285 కిపైగా యూనిట్లు,34 వేలకు పైగా జౌషధాలు అమ్మే దుకాణాలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పరిమితమైన మానవవనరులు, ల్యాబ్ కెపాసిటీ తక్కువగా ఉందని, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, డ్రగ్ కంట్రోల్ కు సంబందించి కార్యకలపాలు బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ జౌషధాలను అరికట్టాలని సీఎం జగన్ గట్టిగా చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రగ్ తయారీ యూనిట్లు, ఔషధ దుకాణాలపై జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో కఠిన నిబంధనలు తీసుకురావాలని అధికారులకు సూచించారు