అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ కల్పన హామీ నెరవేర్చడమే లక్ష్యంగా AP లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి తోడ్పడే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా కన్సల్టేటివ్ ఫోరంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం, సీఐఐ (Confederation of Indian Industry) ఉమ్మడి భాగస్వామ్యంతో జీవో నెంబర్ 58ని విడుదల చేసింది. ఈ ఫోరం ద్వారా పెట్టుబడిదారులు తమకు ఎదురవుతున్న సమస్యలను నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు అవకాశం లభిస్తుంది.
విజయవాడలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్, సీఐఐ ప్రతినిధుల సూచన మేరకు వారం రోజుల్లో ఈ ఫోరంను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీ ప్రకారమే జీవో విడుదల చేశారు. కన్సల్టేటివ్ ఫోరం రెండు సంవత్సరాల కాలపరిమితితో ఏర్పాటైంది.
ఈ ఫోరం పారిశ్రామిక రంగం మరియు ప్రభుత్వ మధ్య అనుసంధానకర్తగా పని చేస్తూ, పెట్టుబడులను రాష్ట్రంలోకి ఆకర్షించేందుకు వేగంగా అడుగులు వేయనుంది. ముఖ్యంగా, ప్రభుత్వం సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సౌకర్యం కల్పించే దిశగా ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డును పునరుద్ధరించింది. ఈ బోర్డు ద్వారా పారిశ్రామికవేత్తలకు మరింత సౌలభ్యం కల్పించనుంది.
ఈ ఫోరంకి నారా లోకేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆయన ఆర్టీజీఎస్ (Real Time Governance Society) మంత్రిగా వివిధ శాఖల మధ్య సమన్వయం కల్పిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉన్న రాష్ట్రం, డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తోంది.
ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించి, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది.