తెలంగాణ: బీజేపీ కీలక నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహంతో ఊగిపోయిన సంఘటన మంగళవారం మేడ్చల్ జిల్లా పోచారం మునిసిపాలిటీలో చోటుచేసుకుంది.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అఘాయిత్యాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఈటల, తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను చెంపచెల్లుమనిపించారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ మహిళ తన స్థలంపై బ్రోకర్లు కబ్జా చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఈటలకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పాటు మరికొందరి వేదన వినగానే ఈటల తీవ్ర ఆగ్రహంతో స్పందించారు.
అక్కడికి వెళ్లిన వెంటనే, జనం చూపిన బ్రోకర్‌ను నిలదీశారు. ఆ వెంటనే చెంపపై కొట్టడంతో పాటు, అతడిని తన అనుచరుల నుండి విడిపించి పక్కకు పంపారు.
ఇంతకాలం సౌమ్యంగా ఉండే నేతగా పేరొందిన ఈటల ఈ విధంగా స్పందించడంతో అందరూ నివ్వెరపోయారు. ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ విధంగా వ్యవహరించారని అనుచరులు తెలిపారు.
అయితే, ఈ ఘటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈటల వైఖరిపై సమీక్ష అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.