టాలీవుడ్: తెలుగు సినిమా సంగీతం లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ టీవీ లో ప్రసారం అయ్యే ‘పాడుతా తీయగా‘ కార్యక్రమం ఎంతో మంది నేపధ్య గాయకులని అందించింది. కేవలం సింగర్స్ ని అందించడమే కాకుండా సంగీతం తాలూకు మూలాల్ని, తెలుగు సాహిత్యం తాలూకు చరిత్రని, తెలుగులో ఉన్న గొప్ప గాయకుల్ని, సంగీత ప్రముఖుల్ని ప్రస్తుత జెనెరేషన్ కి తెలియచేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ కార్యక్రమం ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారి నేతృత్వంలో నిరాటంకంగా కొనసాగింది. కానీ పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఆయన మృతి చెందడం తో ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగింది.
ఎంత ప్రయత్నించినా బాలు గారిని మ్యాచ్ చేయడం అంటే కష్టమే అని చెప్పుకోవాలి కానీ అంత కాక పోయిన ఎంతో కొంత ప్రయత్నించి ఆయన మొదలు పెట్టిన ఒక మహాయజ్ఞాన్ని కొనసాగించడానికి ఈటీవీ యాజమాన్యం కృషి చేసి ఆ దిశగా మొదటి అడుగులు వేసింది. అందుకోసం బాలు గారి వారసుడు ప్రముఖ గాయకుడు ఎస్.పి. చరణ్ ని ఎంపిక చేసుకున్నారు. చరణ్ తో పాటు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ మరియు మరొక సింగర్ సునీత ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంచుకున్నారు.
పాడుతా తీయగా నెక్స్ట్ సీజన్ ప్రారంభించడానికి ఆడిషన్స్ కూడా మొదలుపెట్టారు. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలు గారు మొదలు పెట్టిన ఈ కార్యక్రమాన్ని అర్దాంతరంగా వొదిలివేయకుండా ఆయన కల ని నెరవేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేయనున్నట్టు తెలిపారు. ఏది ఏమైనా ఈ కారక్రమం ద్వారా మరోసారి బాలు గారి లెగసీ ని కంటిన్యూ చేస్తూ తెలుగు సంగీతాన్ని, సాహిత్యాన్ని బాలు గారి లాగానే కొనసాగించాలని ఆశిద్దాం. ఎంతో మంది మేటి సింగర్స్ ని ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయాలనీ ఈ ప్రోగ్రాం ద్వారా సంగీతాభిమానులని అలరించాలని ఆశిద్దాం.