లండన్: ఈయూ లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. అక్కడి డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ యొక్క మొదటి డోసు ఇచ్చారు. మొదటి డోసు తీసుకున్న వారికి తిరిగి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈయూలో 27 సభ్య దేశాలు ఉండగా, జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు ఒకరోజు ముందే అంటే శనివారం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి.
కరోనా వైరస్ బారినపడే ప్రమాదం అత్యధికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు తొలుత ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. స్పెయిన్‌లో 96 ఏళ్ల వృద్ధుడికి తొలి డోసు ఇచ్చారు. చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి అండ్రెజ్ బబీస్ కూడా ఆదివారం వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. జర్మనీలో 101 ఏళ్ల మహిళ కుడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈయూలో ఇప్పటివరకు 1.60 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,36,000 మంది బాధితులు మరణించారు.
ఆక్స్‌ఫర్డ్, అస్ట్రాజెనెకా కలిసి సమ్యుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గురువారంలోగా యూకే ప్రభుత్వం అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల మందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం తెలిపింది.
ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలోనే ఆక్స్‌ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలిందని అస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కాల్ సొరియొట్ చెప్పారు. కరోనా బాధితులపై 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని, ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చు.