న్యూఢిల్లీ: ఆక్స్ ఫర్డ్ వారి ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతునే ఉన్నాయి. కరోనా వైరస్ నివారణకు వాక్సీన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి.
ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరు వ్యక్తులకు రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెన్మార్క్ దేశ ఆరోగ్య అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డెన్మార్క్‌లో పరిస్థితులు బాగానే ఉన్నా, వ్యాక్సిన్‌తో ముడిపడి ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి.
కాగా ఈ కేసులను మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం చాలా ఉందని హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ తెలిపారు. అందుకే తాము ఈ వ్యాక్సిన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించలేదు కానీ, తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశామని తెలిపారు. టీకా సురక్షితమైనది సమర్థవంతమైందని రుజువు చేసే విస్తృత డాక్యుమెంటేషన్ ఉంది కానీ, ఇతర యూరోపియన్ దేశాలలో తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారాన్ని పరిశీలించాలని బ్రోస్ట్రోమ్ చెప్పారు.