లండన్: ప్రపంచ టెక్ దిగ్గజం మరియు సెర్చ్ ఇంజిన్ సంస్థ అయిన గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకు ముందు గూగుల్ సంస్థపై 2.42 బిలియన్ యూరోల జరిమానా విధిస్తూ యూరోపియన్ కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది.
కాగా గూగుల్ ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చేసిన అభ్యర్థనను యూరోపియన్ యూనియన్ ఉన్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ఈ విషయంలో గూగుల్‌పై విధించిన జరిమానా నిర్ణయం సబబేనని న్యాయస్థానం తమ అభిప్రాయం వ్యక్తం చేసింది.
విషయమేంటంటే, 2017లో తన పోటీదారులకు హాని కలిగించేలా సందర్శకులను దాని స్వంత షాపింగ్ సర్వీసుకు అనుకూలంగా వ్యవహరించడం కోసం గూగుల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై యూరోపియన్ కమిషన్ గూగుల్‌పై 2.4 బిలియన్ యూరోల భారీ జరిమానాను విధించింది.
కాగా దీన్ని వ్యతిరేకిస్తూ యూరోపియన్ కమిషన్ జనరల్ కోర్టులో గూగుల్ అప్పీల్ చేసింది. అయితే ఈ అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చడంతో పాటు గూగుల్ పై విధించిన జరిమానాను సమర్థించింది కూడా. యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా 2017లో మార్పులు చేసినట్లు గూగుల్ తెలిపింది. “మా కొత్త విధానం మూడు సంవత్సరాలకు పైగా విజయవంతంగా పనిచేసినట్లు” గూగుల్ ప్రకటనలో తెలిపింది.
యూరోపియన్ ఖండంలో ఆన్‌లైన్ దిగ్గజం ప్రాబల్యాన్ని అరికట్టడానికి యూరోపియన్ రెగ్యులేటర్లు చేసిన ప్రయత్నంలో ఒక భాగమే ఈ జరిమానా విధింపు. దాని తర్వాత కూడా గూగుల్‌పై మరో రెండు యాంటీట్రస్ట్ పెనాల్టీలు విధించాయి. మొత్తం 8.25 బిలియన్ యూరోల($9.5 బిలియన్)కు సంబంధించి కంపెనీ కూడా అప్పీల్ చేసుకుంది.