నకిరేకల్: బిఆర్ఏస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నోటీసులు అందుకున్న వెంటనే లింగయ్య స్పందిస్తూ, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పోలీసుల ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెప్పారు.
తనపై వచ్చిన ఈ నోటీసులను రాజకీయ కుట్రగా భావిస్తున్నానని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం వల్లే తనకు ఈ నోటీసులు పంపారని ఆయన ఆరోపించారు.
తాను పనిచేసిన జిల్లా పోలీసు అధికారులతో నియమిత చర్యల్లో భాగంగా మాట్లాడడం సహజమని పేర్కొంటూ, పోలీసుల పోస్టింగులు లేదా కార్యకర్తల అవసరాల విషయాల్లోనూ మాట్లాడే సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవ్వాలని అందులో పేర్కొనడంతో లింగయ్య నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా తిప్పికొడుతూ, న్యాయపోరాటం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.