విజయవాడ : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ఫ్రంట్లైన్ వర్కర్లకు భరోసాని కల్పించింది. ఎక్స్గ్రేషియాను డిమాండ్ చేసిన జూనియర్ డాక్టర్ల కోరికను నెరవేర్చింది. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించే వైద్యులు, వైద్య సిబ్బందికి భారీ ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఏకే సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా విధుల నిర్వహణలో వైద్య సిబ్బంది ఎవరైనా మృతి చెందితే సదరు వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, అదే స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్ఎస్ఓ లేదా ఎమ్ఎస్ఓలు మరణిస్తే రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా అలాగే ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది.
అలాగే ఈ ఎక్స్గ్రేషియా తక్షణమే అందించేలా జిల్లా కలెక్టర్లకు అధికారాన్ని కట్టబెట్టిది. ఆ జిల్లా కలెక్టర్లు కావాల్సిన డాక్యుమెంట్లను పరిశీలించి ఎక్స్గ్రేషియా అందించేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే కోవిడ్ వలన మరణించారని ధ్రువీకరణ పొందిన వారందరికీ ఈ ఎక్స్గ్రేషియా వర్తించనుంది. వారు ఇతర భీమా పరిహారాలను పొందినప్పటికీ ఇది అన్నింటికీ అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది.