న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ త్వరలో తన మంత్రి మండలిని విస్తరించనున్నారని సమాచారం. ఆయన నేతృత్వంలో రెండో దఫా ఎన్నికల తరువాత కొలువుదీరిన ఎన్డీయే కూటమి రెండేళ్ల పాలన ఇటీవలే పూర్తి చేసుకుంది.
రాబోయే సాధారణ ఎన్నికలకు ఇంఖా మరో మూడేళ్లు గడువు ఉంది. అయితే ఈ నేపథ్యంలో పాలనను మరింత మెరుగైనదిగా మార్చడానికి మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారు. గత శని, ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్.సంతోష్‌లతో చర్చలు జరిపి ఇప్పటికే విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మంత్రి మండలిలో ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్నారు, కాగా ఇప్పుడు మరొక 25 మందిని కొత్తగా చేర్చనున్నట్టు తెలుస్తోంది. ఈ పాటికే స్వతంత్ర హోదా మరియు సహాయ మంత్రి పదవిని నిర్వహిస్తున్న కొందరు మంత్రుల్లో ఒకరిద్దరికి క్యాబినెట్ ర్యాంకు దక్కే అవకాశాలు కూడ కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే మండలిలో ఉన్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించి వారికి భారం తప్పించనున్నట్టు సమాచారం.
2023లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున అక్కడి నుండి ఇంకొకరికి కూడా ప్రాతినిధ్యం దక్కనుంది. ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు సహాయమంత్రి పదవి దక్కే చాన్సున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏపీ నుంచి బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న సీనియర్లు సురేష్ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులలో జీవీఎల్‌కుగానీ, టీజీ వెంకటేష్‌కుగానీ చాన్సు దక్కొచ్చని తెలుస్తోంది.