న్యూఢిల్లీ: ఎంపీ మరియు మాజీ క్రికెటర్ అయిన గౌతం గంభీర్ ద్వారా నిర్వహించబడుతున్న ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను అనధికారికంగా నిల్వ ఉంచడమే కాకుండా, వాటిని పంపిణీ చేయడానికి ఆ ఫౌండేషన్ సిద్ధమైన విషయంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దోషిగా తేల్చింది.
ఈ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో గౌతం గంభీర్‌ను దోషిగా పేర్కొంది. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ ప్రకారం అలా ఫాబీఫ్లూ టాబ్లెట్లను నిల్వ ఉంచడం చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపింది. అదే విధంగా ఈ యాక్ట్ ప్రకారం ఆప్ ఎమ్మెల్యే అయిన ప్రవీణ్ కుమార్ ని కూడా దోషిగా తేల్చింది. దోషిగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు డీజీసీఐని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 29న జరగనుంది.
ఈ మధ్యనే గంభీర్ ఢిల్లీలో కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను పంచారు. ఈ విషయం పై దాఖలైన పిటిషన్‌లో డ్రగ్ కంట్రోలర్ విచారణ జరిపింది. ఈ విచారణలో గంభీర్ ఫౌండేషన్‌కు డీసీజీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
అయితే జస్టిస్ విపిన్ సంఘి, జస్మీత్ సింగ్ ల డివిజన్ బెంచ్ డీజీసీఐను మందలిస్తూ మరోసారి నివేదిక, దర్యాప్తునకు ఆదేశించింది. అయితే డీజీసీఐ తాజాగా కోర్టుకు సమర్పించిన నివేదికలో గంభీర్ ని దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరింత పురోగతి విచారణ కోసం కోర్టు ఆరు వారాల గడువును ఇచ్చింది.