ఢిల్లీ: దేశంలో నకిలీ రూ.500 నోట్లు మళ్లీ విపరీతంగా చలామణిలోకి వస్తున్నాయని కేంద్ర హోం శాఖ అధికారిక హెచ్చరిక జారీ చేసింది. నకిలీ నోట్లను పక్కా నైపుణ్యంతో రూపొందిస్తున్న దుండగులు.. వాటిని అసలైనట్లే తయారు చేస్తున్నారని వెల్లడించింది.
ఈ నకిలీ నోట్లను గుర్తించడం చాలా కష్టంగా మారిందని, అయితే ఓ చిన్న తప్పిదం ఆధారంగా వాటిని గమనించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ‘‘RESERVE BANK OF INDIA’’ అనే అక్షరాల్లో ‘‘RESERVE’’ అనే పదంలో చివరి ‘‘E’’ బదులు ‘‘A’’ ఉండటం గమనార్హమైన తేడా అని తెలిపారు.
ఈ తేడాను కేంద్రం గమనించి వెంటనే డీఆర్‌ఐ, సీబీఐ, ఎన్‌ఐఏ, ఎఫ్‌ఐయూ, సెబీ వంటి కీలక సంస్థలతో ఈ సమాచారాన్ని పంచుకున్నట్లు తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు పంపించింది.
ప్రజలు కూడా చేతుల్లోకి వచ్చే రూ.500 నోట్లను జాగ్రత్తగా పరిశీలించి ఆ తేడా ద్వారా నకిలీగా ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించాలన్నారు. అనుమానాస్పద నోట్లను వెంటనే పోలీసులకు, బ్యాంకులకు తెలియజేయాలన్నారు.
నకిలీ నోట్ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని మరింతగా ప్రచారం చేయాలని సూచిస్తున్నారు.