హైదరాబాద్: ఒక ఫేక్ ఈ–మెయిల్ ఐడీతో సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారికి రూ.60 లక్షలు టోకరా వేశారు. జూబ్లీహిల్స్‌కు చెందిన శేషగిరిరావు ట్రైక్యాడ్ డిజైన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈయనకు తన క్లయింట్ అయిన అమెరికాకు చెందిన గ్లోబల్ జియో సప్లయిస్ సంస్థ నుంచి 3డీ సాఫ్ట్ మౌస్‌లు దిగుమతి చేసుకుంటుంటారు. ఇటీవల శేషగిరిరావుకు చెందిన అధికారిక ఈ–మెయిల్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
ఈ క్రమంలో తన క్లయింట్ అమెరికా సంస్థ అధికారిక ఈ–మెయిల్ ఐడీని పోలిన మరో ఐడీని క్రియేట్ చేసి దాన్నుంచి ఈ నెల 8న శేషగిరిరావుకు సైబర్‌గాళ్లు ఓ ఫేక్ మెయిల్ పంపారు. అందులో తమకు చైనా సంస్థతోనూ లావాదేవీలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ దేశంపై అమెరికాలో ఆంక్షలు ఉన్నందున అక్కడి నుంచి తమకు అవసరమైన సరుకును మీరు దిగుమతి చేసుకుని, ఆ సరుకు భారత్ నుంచి తమకు ఎగుమతి చేస్తున్నత్లు పంపమన్నారు. అందులోనే చైనాకు చెందిన సంస్థ పేరుతో ఓ చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరిచారు. ఈ ఖాతాలోకి 79,800 డాలర్లు (రూ.60 లక్షలు) జమ చేస్తే మీకు చైనా నుంచి సరుకు వస్తుందని తెలిపారు.
సదరు అమెరికా సంస్థతో శేషగిరిరావుకు 13 ఏళ్లుగా వ్యాపార అనుబంధం ఉండటంతో అతను ఆ ఖాతాలోకి ఈ నెల 18న ఆ మొత్తం డబ్బు జమ చేశాడు. ఇది జరిగిన రెండ్రోజులకు స్పేర్ పార్ట్స్ పంపడానికి మరికొంత మొత్తం చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఇంకో మెయిల్ పంపారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి తనకు వచ్చిన మెయిల్ ఐడీని నిశితంగా పరిశీలించగా తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇది నైజీరియన్ల పని అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు.