ప్రకాశం: ప్రస్తుత కాలంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ దాదాపు ఫేస్‌బుక్‌లో అకౌంట్ కలిగి ఉంటారు. మారుతున్న కాలంతో పాటు యువత ఇంటర్నెట్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫేస్‌బుక్ ఖాతాను ప్రతి పనిని పంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఎటువంటి సమాచారమైనా క్షణాల్లో పోస్టింగ్ చేయడం, షేర్ చేయడం ఒక పెద్ద అలవాటుగా అందరికీ మారి పోయింది.
వీటి వల్ల ఉన్న ఉపయోగాలకంటే, చాలా మందికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఫేస్‌బుక్ అకౌంట్‌లో ప్రొఫైల్ ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకుని ఆ ఫోటోను వాడి ఫేక్ అకౌంట్‌ను అదే పేరుమీద ఓపెన్ చేస్తున్నారు. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో హెల్ప్ మీ, అంటూ చాటింగ్ చేస్తారు.
దీని ద్వారా ఎవరైనా స్నేహితులు స్పందించినప్పుడు వారితో అర్జెంట్‌గా అమౌంట్ కావాలని, గూగూల్ పే, ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇలా ఏదీ కావాలంటే అది ఇస్తారు. ఆపదలో ఉన్నారేమో అని అత్యవసరంగా డబ్బు అవసరమై ఉంటుందని భావించిన స్నేహితులు రూ.20 వేలు, రూ.10 వేలు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.
మొదట్లో పెద్ద మొత్తంలో మనీ అవసరమంటూ చాటింగ్ చేస్తూ చివరకు ఎంతో కొంత అత్యవసరంగా కావాలంటూ అడుగుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ ఎస్‌ఐ, కంభంలోని హీరో షోరూమ్ వ్యక్తి, బేస్తవారిపేటలోని ఓ కళాశాల కరస్పాండెంట్‌ల పేరుతో దొంగ ఫేస్‌బుక్ అకౌంట్‌లు సృష్టించి పలువురి నుంచి భారీగానే అమౌంట్ దోచేశారు. ఇచ్చిన బ్యాంక్ అంకౌంట్ నంబర్‌లు, ఫోన్ నెంబర్‌లు ఛత్తీఘడ్‌లోని రాయచూర్ ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు.
గూగూల్ పే, ఫోన్ పేలలో ఫోన్ నంబర్ నమోదు చేయగానే పేరు చూపిస్తుంది. దొంగతనంగా తయారు చేసిన డూప్లికేట్ వ్యక్తుల ఫోన్ నంబర్ ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు సంబంధించినా ఓరిజినల్ వ్యక్తికి సంబంధించిన పేరు వస్తుంది. దీంతో నగదు బదిలీ చేసేటప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా స్నేహితులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రాన్సక్షన్స్ ముగిసిన తర్వాత మరుసటి రోజుకు అతని ఫోన్ నంబర్ ఫోన్ పేలో నమోదు చేస్తే వేరే పేరు రావడం గమనార్హం.