చప్పోర: నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ! ఇటీవలి కాలంలో బ్యాంక్ లావాదేవీలలో మోసాలు, నకిలీ పత్రాల ద్వారా మోసాలు మరియు ఇతర ఆర్థిక వంచన కేసులు ఎన్నో చూస్తున్నాము.
అయితే, చత్తీస్‌గఢ్‌లో ఇటీవల వెలుగుచూసిన ఘటన, మతిపోయే ప్లానింగ్‌తో నడిపిన ఒక అత్యంత ధైర్యవంతమైన పన్నాగంగా నిలిచింది.
సినిమా కథలా ఉన్న ఈ స్కామ్‌లో దుండగులు నకిలీ ఎస్బీఐ (State Bank of India) శాఖను ప్రారంభించి, నిరుద్యోగులను, గ్రామస్తులను మోసం చేయడమే కాకుండా, నకిలీ నియామకాలతో పాటు, ట్రైనింగ్ సెషన్లు కూడా నిర్వహించారు.
రాయ్‌పూర్‌కు 250 కి.మీ దూరంలోని సక్తి జిల్లా చప్పోర గ్రామంలో, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐలో ఉద్యోగం చేస్తున్నామని అనుకున్న ఆరుగురు నిరుద్యోగులు మోసపోయారు.
కేవలం 10 రోజుల క్రితం తెరిచిన ఈ నకిలీ శాఖలో అసలు బ్యాంక్ లాగా కొత్త ఫర్నిచర్, బ్యాంక్ కౌంటర్లు, మరియు అవసరమైన అన్ని పత్రాలు అందుబాటులో ఉంచారు.
గ్రామస్థులు ఈ నకిలీ బ్యాంక్‌ను (Fake SBI Branch) నిజమైనది అనుకొని, అకౌంట్లు తెరవడానికీ, లావాదేవీలు చేసుకోవడానికి వచ్చారు.
నకిలీ ఉద్యోగ నియామకాలు పొందిన ఉద్యోగులు కూడా ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించానని సంబర పడ్డారు.
అయితే, సెప్టెంబర్ 27న దగ్గర్లోని దబ్రా శాఖ మేనేజర్‌కు అనుమానం రాగా, ఉన్నతాధికారులు, పోలీసులతో కలిసి విచారణ చేయగా, ఈ చప్పోర బ్రాంచ్ నకిలీదని తేలింది.
దబ్రా బ్రాంచ్ మేనేజర్ నుంచి సమాచారం అందుకున్నాక, విచారణ చేపట్టాం.
బ్యాంక్ నకిలీదని తేలడంతో పాటు, చాలా మంది ఉద్యోగులను నకిలీ పత్రాల ద్వారా నియమించారని గుర్తించాం, అని సీనియర్ పోలీస్ అధికారి రాజేష్ పటేల్ అన్నారు.
ఈ స్కామ్‌లో రేఖా సాహు, మందిర్ దాస్, మరియు పంకజ్ అనే ముగ్గురిని అనుమానితులుగా గుర్తించామని చెప్పారు.
వీరు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్లుగా వ్యవహరించారు.
ఉద్యోగులకు నకిలీ ఆఫర్ లెటర్స్
ఈ నకిలీ బ్రాంచ్‌లో నకిలీ ఆఫర్ లెటర్స్‌తో మేనేజర్లు, మార్కెటింగ్ ఆఫీసర్లు, క్యాషియర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు.
వీరికి నకిలీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఉద్యోగాలు పొందడానికి వారు రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ చెల్లించారని తెలుస్తోంది.
స్థానిక వ్యక్తి అజయ్ కుమార్ అగర్వాల్ ఎస్బీఐ కియోస్క్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, చప్పోరలో ఒక్కసారిగా ఎస్బీఐ బ్రాంచ్ తెరవడంతో ఆశ్చర్యపోయారు.
దబ్రాలో ఉన్న బ్రాంచ్‌ను అనుసరించే నూతన శాఖ ఎలాంటి నోటీసు లేకుండా తెరుచుకోడమే అనుమానం కలిగించింది.
ఆ బ్యాంక్ ఉద్యోగులను ప్రశ్నించగా సరైన సమాధానాలు రాకపోగా, బ్రాంచ్ కోడ్ కూడా చూపించలేకపోయారు.
అజయ్ ఈ విషయాన్ని దబ్రా బ్రాంచ్ మేనేజర్‌కు తెలియజేయగా, విచారణ తర్వాత నకిలీ స్కామ్ బయటపడింది.
కిరాయికి తీసుకున్న భవనంలో నకిలీ ఎస్బీఐ బ్రాంచ్
చప్పోర గ్రామస్థుడు తోష్ చంద్రకు చెందిన భవనాన్ని నెలకు రూ. 7,000 చెల్లించి, ఈ నకిలీ బ్యాంక్ నిర్వహించారు.
నకిలీ ఫర్నిచర్, సైన్‌బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. వారి ప్రధాన లక్ష్యంగా నిరుద్యోగులు, వివిధ జిల్లాలవారు – కొర్బా, బాలోద్, కబీర్ధామ్, మరియు సక్తి నుంచి వచ్చి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.
జ్యోతి యాదవ్ అనే మహిళ, నేను పత్రాలు సమర్పించి, బయోమెట్రిక్స్ పూర్తి చేసి, నా జాయినింగ్ నిర్ధారితమైందని చెప్పారు.
రూ. 30,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు అని తెలిపారు.
సంగీత కన్వార్ అనే మరో బాధితురాలు, “వారు 5 లక్షలు అడిగారు. నేను ఇంత మొత్తం ఇవ్వలేనని చెప్పాక, చివరికి 2.5 లక్షల రూపాయలతో ఒప్పందం కుదిరింది” అని అన్నారు.
“ఈ నకిలీ బ్యాంక్ కొనసాగి ఉంటే, చాలా మంది ప్రజలు డిపాజిట్లు పెట్టేవారు. వారి డబ్బులు కోటి రూపాయల వరకు మోసపోయేవి” అని గ్రామస్థుడు రామ్ కుమార్ చంద్ర అన్నారు.
నిరుద్యోగులు తమ ఆభరణాలు గానీ, రుణాలు గానీ తీసుకుని ఈ ఉద్యోగాల కోసం వెచ్చించి, ఇప్పుడు ఆర్థిక నష్టంతో పాటు, న్యాయ సమస్యలతో పోరాడుతున్నారు.