భావోద్వేగాల నడుమ ముగిసిన సీజేఐ చంద్రచూడ్ వీడ్కోలు
జాతీయం: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తన చివరి పనిదినం సందర్భంగా చెప్పిన ప్రకటనలు గంభీరంగా నిలిచాయి. నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్న ఆయనకు శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, అవసరమైన వారిని వ్యక్తిగతంగా తెలియకపోయినా సేవ చేయడం జీవితంలో అసాధారణమైన సంతృప్తి కలిగిస్తుందని అన్నారు.
సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, తదనంతరం జస్టిస్ జె.బి. పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన సేవలకుగాను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రత్యేక సభను నిర్వహించింది. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ‘‘న్యాయం గురించి, జీవితం గురించి మీ అందరి నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈరోజు కూడా 45 కేసులు విచారించా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. తెలియకుండా నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణ కోరుతున్నా’’ అన్నారు.
సహ న్యాయమూర్తులు జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ తమ ప్రసంగాల్లో సీజేఐతో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకొన్నపుడు భావోద్వేగానికి గురైన జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కళ్లు చెమ్మగిల్లాయి.
జస్టిస్ డి.వై.చంద్రచూడ్ న్యాయమూర్తులను ప్రజలు విమర్శించేలా స్వేచ్ఛ ఇచ్చారని, ఆయన ‘‘అసాధారణ తండ్రికి అసాధారణ కుమారుడు’’ అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ అభివర్ణించారు. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వై.వి.చంద్రచూడ్ 1978 – 1985 నడుమ సీజేఐగా పనిచేసిన విషయం తెలిసిందే.
జస్టిస్ చంద్రచూడ్ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు. జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ, ‘‘ఆస్ట్రేలియాలో కూడా జస్టిస్ చంద్రచూడ్ యువకుడిలా కనిపిస్తారని చర్చ సాగింది. తన నిర్ణయాలతో సుప్రీంకోర్టు పనితీరును ఆయన విశేషంగా మెరుగుపరచారు’’ అని వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తులపై విమర్శలు రావడం సర్వసాధారణమేనని, సామాజిక మాధ్యమాల్లో తనపై జరిగిన ట్రోలింగ్‌ను సైతం విశాల దృక్పథంతో స్వీకరించినట్లు చంద్రచూడ్ తెలిపారు.
ఆయన మాటల్లో, ‘‘మనం లేకపోతే కోర్టు నడవదనే భావన ఎవరికి రావొద్దు. ప్రతి న్యాయమూర్తి సేవే గౌరవించదగినది’’ అన్నారు. 38 రాజ్యాంగ ధర్మాసన తీర్పుల్లో పాల్గొన్న ఆయన సేవలు అనితర సాధ్యమని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అభివర్ణించింది.
గతంలోనూ ఎంతోమంది గొప్ప న్యాయమూర్తులు వచ్చారు.. తర్వాతి తరాలకు దారి చూపించి వెళ్లిపోయారు. జ్ఞాపకాలు మన కలలను అధిగమిస్తే వృద్ధాప్యం వచ్చిందనే అర్థం. ఒక సంస్థకు నాయకత్వం వహించిన వ్యక్తి ‘నా తర్వాత.. ఉపద్రవమే’ అనుకోవడం భ్రమ. సంస్థలు నమ్రతతో కొనసాగుతాయి – వీడ్కోలు సభలో జస్టిస్ డి.వై.చంద్రచూడ్.
జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.