శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మరియు నేషనల్ కాన్ఫరెన్స్ నేత అయిన ఫరూఖ్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి జమ్మూ, శ్రీనగర్‌లలోని ఆయనకు చెందిన 11.86 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసింది.
ఈ మేరకు శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో రెండు ఇళ్లు, ఒక వ్యాపార భవనం మరియు మూడు స్థలాలు ఉన్నాయి. ఈడీ వాటి విలువను ప్రభుత్వ లెక్క ప్రకారం 11.86 కోట్ల రూపాయలకు లెక్కగట్టినప్పటికి, వాటి మార్కెట్ విలువ మాత్రం దాదాపు 60-70 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.
అయితే, ఈ కేసుకు సంబంధించి ఫరూఖ్ అబ్దుల్లా ఇంతకుముందు పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఫరూక్ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12 లో పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపణలు చేసింది.