గుంటూరు: క్రితం ఏడాది ఆగస్టు 15వ తేదీన జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనలు జరిగిన తరువాత కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది.
ఈ కేసులో కోర్టు 28 మంది సాక్షుల నుండి వాంగ్మూలాన్ని తీసుకుంది. కాగా ఈ కేసును 9 నెలల్లోనే విచారణ పూర్తిచేసి కోర్టు తన తీర్పునిచ్చింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కూడా కీలకంగా మారిందని, సెక్షన్ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వం తరగున న్యాయవాది తెలిపారు.
నిందితుడు శశికృష్ణ తనను ప్రేమించడంలేదని ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు పొడిచి చంపాడు. అయితే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగానే రమ్య ప్రాణాలు విడిచింది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు ఆరురోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించింది.