తెలంగాణ: ఫిబ్రవరి 4, 2025.. నా రాజకీయ జీవితంలో ప్రత్యేకం- రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 4న తన రాజకీయ జీవితంలో ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణపై కమిషన్ సిఫారసులు: సమగ్ర నివేదిక సమర్పణ
ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను సమర్పించింది. కమిషన్ పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రజలనుంచి విజ్ఞప్తులు స్వీకరించి సమగ్ర అధ్యయనం చేసింది. ప్రజలు స్వయంగా తమ అభిప్రాయాలను తెలియజేయగా, మరికొందరు ఆన్‌లైన్ ద్వారా విజ్ఞప్తులు పంపించారు. మొత్తం 82 రోజుల్లోనే ఈ కమిషన్ తన నివేదికను రూపొందించింది.
వర్గీకరణ సిఫారసులు:
కమిషన్ తన నివేదికలో 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను మూడు గ్రూపులకు విభజించాలని సిఫారసు చేసింది. మొత్తం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి, ఆయా గ్రూపుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని సూచించింది.
- గ్రూప్-1: 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్ (జనాభా 3.288%)
- గ్రూప్-2: 18 ఎస్సీ ఉపకులాలకు 9% రిజర్వేషన్ (జనాభా 62.74%)
- గ్రూప్-3: 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ (జనాభా 33.963%)
ఇంకా, వర్గీకరణ కమిషన్ రిజర్వేషన్ అమలులో రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానం కూడా అనుసరించాలని పేర్కొంది.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు:
ఈ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “ఎస్సీ వర్గీకరణ, కులగణన నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అంశాలు. ఫిబ్రవరి 4, 2025, నా జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది” అని అన్నారు.
అలాగే, “గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఈ సమస్యను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కానీ, మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తోంది. వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని పేర్కొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ, ఈ వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు హాని కలగదని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి తీసుకున్నదని ఆయన వివరించారు.