అమరావతి: ‘ఫెంగల్’ ప్రభావం.. రాయలసీమ, కోస్తాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాను (Cyclone Fengal) గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదులుతోంది.
ప్రస్తుతానికి పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శనివారం సాయంత్రానికి ఈ తుపాను ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తీరానికి చేరుకునే సమయంలో తుపాను నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుపాను కారణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల 70-90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో వర్షాలతో పాటు తుఫాన్ ప్రభావం అధికంగా ఉండొచ్చని వాతావరణ శాఖ వివరించింది.
విమాన రాకపోకలపై ప్రభావం
తుపాను ప్రభావంతో విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే పలు విమానాలను అధికారులు రద్దు చేశారు.
చెన్నై ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. హైదరాబాద్-చెన్నై, తిరుపతి-విశాఖ విమానాలు కూడా రద్దయ్యాయి.
రైతుల కోసం హెచ్చరికలు
వరి కోతల సమయంలో తుపాను ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరి పొలాలు నీటమునగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితి
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
తీవ్ర ప్రభావం.. ముందస్తు చర్యలు
తీర ప్రాంతాల్లో ప్రజలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంది.