హైదరాబాద్: ఒక మనిషి వందేళ్లు బతకాలంటే అతను వందేళ్లు జీవించి ఉండాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన పనుల వల్ల జనాల గుండెల్లో వందేళ్లు బతుకుతాడు.. అని ఎక్కడో విన్నాను. అలా చెప్పుకుంటే మన బాల సుబ్రహ్మణ్యం వందేళ్లు కాదు భూమి మీద పాట ఉన్నన్నాళ్ళు, సంగీతం ఉన్నన్నాళ్ళు బతుకుతాడు. మన అని ఎందుకన్నాం అంటే ఆయన మనందరి ఇళ్లల్లో ఒక భాగం. దాదాపు 60 ఏళ్లుగా ఆయన పాడుతూనే ఉన్నాడు. అతని పాటలు ఎదో ఒక రూపం లో ప్రతి రోజు మన చెవిన పడుతూనే ఉంటాయి. మనం చుట్టూ తిరిగే ప్రపంచం లో ఆయన పాట వినని రోజు ఉండదంటే ఆశ్చర్యం లేదు.
మన దేశం లో ఎక్కడికి వెళ్లినా ముఖ్యంగా దక్షిణ భారత దేశం లో ఎదో ఒక దగ్గర టీ కోసం ఆగినా కూడా అక్కడి బాష పాట విని అరెరే.. ఇది బాలు గారి గొంతు కదా.. అనుకున్న సందర్భాలు అనేకమందికి ఉన్నాయి. ఒక మనిషి పుట్టుక నుండి చావు వరకు మనిషికి సంబందించిన ప్రతీ ఘట్టానికి సంబంధించి బాలు గారి పాటలు ఒక్కటి కాదు అనేకం ఉంటాయి. పుట్టుక, చావు, పెళ్లి, పుట్టినరోజు, పెళ్లి రోజు… ఇలా ఏదైతేనే, దేవుడికి మొక్కాలన్నా కూడా అక్కడ బాలు గారి పాటనే.. ఇలా ప్రతీ సందర్భం లో బాలు గారు వినిపిస్తూనే ఉంటారు. నువ్వు బాధలో ఉంటే నిన్ను ఓదారుస్తాడు , ఉల్లాసం గా ఉంటె ఇంకా జోష్ తో వస్తాడు, నువ్వు నిరాశలో ఉంటె నిన్ను మోటివేట్ చేస్తాడు, ఒకరికి ప్రేమ ప్రపోస్ చెయ్యాలన్నా ఎలా చెయ్యాలో చెప్తాడు.. ఇలా ప్రతి ఒక్క విషయంలో బాలు తన పాట ద్వారా మనల్ని కదలిస్తాడు.
పదహారు భాషల్లో నలభై వేల పై చిలుకు పాటలు, ఇరవై ఐదు నంది పురస్కారాలు, ఏడు ఫిలిం ఫేర్ పురస్కారాలు, ఆరు జాతీయ పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్.. కాదేది బాలు గారికి ఈ అవార్డు అనర్హం అన్నట్టు ఇవి ఆయన సాధించిన పురస్కారాలు. ఇంకా ఆయన పాటల్లో ఇవి గొప్పవి అని చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ తయారవుతుంది. అవన్నీ వినడానికి కూడా మనకి సమయం సరిపోదేమో. ఇరవై ఏళ్ల ప్రేమికుడికి పాడాలన్నా, అరవై ఏళ్ల ముసలాడికి పాడాలన్నా ఎలా పాడాలన్నా కూడా ఆ వయసుకి తగ్గట్టు తన గొంతుని సవరించుకొని పాడడం 74 ఏళ్ల బాలు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన పాడిన పాటలు చూస్తుంటే సగటున ఆయన రోజుకి 15 – 20 పాటలు పట్టినట్టు లెక్క.
ఆయన పాడడమే కాదు ‘పాడుతా తీయగా’ లాంటి కార్యక్రమాల ద్వారా అనేక మంది నేపధ్య గాయకులని పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న నేపధ్య గాయకులలో ఎనభై శాతం మంది ఆయన ద్వారానే వచ్చారు అంటే అతిశయోక్తి కాదు. సింగర్ గా ఆయన పాటలు కొన్ని వింటుంటే ఇది హీరో పాడారా లేక బాలు గారు పాడారా అన్నట్టు హీరో గొంతులో పాడగలడు బాలు. సింగర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా చాలా మంచి పాత్రలు చేసాడు బాలు. చాలా మంది తమిళ్ హీరోలకి డబ్బింగ్ కూడా చెప్పాడు బాలు. ముఖ్యంగా కమల్ హాసన్ దశావతారం సినిమాలో ఏడు కారెక్టర్లకి డబ్బింగ్ చెప్పాడు బాలు. అందునా ఏడు కారెక్టర్లకి ఏడు వేరియేషన్స్ అంటే మామూలు విషయం కాదు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. బాలసుబ్రహ్మణ్యం – సావిత్రి దంపతులకు చరణ్ – పల్లవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలుకు ఇష్టమైన గాయకుడు మహమ్మద్ రఫీ. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న'(1966) చిత్రంలో బాలు తొలిసారి పాట పాడారు. ఈరోజు ఆయన మరణం భారత దేశ సంగీతానికి ఒక బ్లాక్ డే లాంటిది. ఆయన అభిమానులు అని చెప్పడం కన్నా ఆయన భక్తులు ఆయన మళ్ళీ వచ్చి చివరగా ఒక్క పాట పాడి వెళ్లినా బాగుండు అని వేడుకుంటున్నారు.
చివరగా….
అమరం.. అఖిలం.. బాలూ నీ గాత్రం…