న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో నేడు తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిని ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో శరవేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందనుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. దీంతో లోక్‌సభ ఫిబ్రవరి 1 వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఏఈ) డాక్టర్ వి. కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఈ రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఆర్థిక సర్వే 2020-21: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రికవరీ ఉంటుందని జీడీపీ వృద్ధిరేటు 7.7 శాతంగా ఉండనుందని సర్వే తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపి వృద్ధి 11 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగంపై కరోనా వైరస్ ప్రభావం పడలేదు. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది.
కాంటాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత ఆర్థిక వృద్ధిని మరింత ప్రభావితం చేశాయి. అయితే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రానున్న రెండేళ్ళలో వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుంది.
17 సంవత్సరాలలో తొలిసారిగా 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్ ఖాతా మిగులు 2 శాతంగా ఉంటుంది. నిరుపేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలనీ, కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని సర్వే సూచించింది. చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలకు పిలుపు నిచ్చింది.
దీనికి తోడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 17 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున‍్న సంగతి తెలిసిందే.