తిరుమల : తిరుమల లోని శ్రీవారి ఆలయంలోని వకుళామాత వంటశాల (పొటు)లో అగ్ని ప్రమాదం సంభవించింది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ పగిలి అందులోని వేడి నీరు ఐదుగురు పోటు కార్మికులపై పడడంతో వారు గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.
హుటాహుటిన వారిని తిరుమలలోని ఆశ్విని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గాయపడ్డ కార్మికులను టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి పరామర్శించారు. టీటీడీలో ఇప్పటివరకు ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని పోటు ఇంచార్జ్ వరద రాజులు అన్నారు.
ఇదిలా ఉండగా దసరా ఉత్సవాల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవ వైభవంగా ముగిసింది. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, చక్రాతాళ్వార్కు ప్రత్యేక స్నపన తిరుమంజనం నిర్వహించారు. చక్రస్నానం మహోత్సవం అనంతరం టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం వైభవోపేతంగా నిర్వహించామని అన్నారు.