అంతర్జాతీయం: 13 ఏళ్ల తర్వాత ఖతార్ నుంచి సిరియాకు తొలి అంతర్జాతీయ విమానం
అంతర్యుద్ధంతో సంక్షోభం మొదలైన తర్వాత సిరియాలో పరిస్థితులు మెల్లగా నిలకడగా మారుతున్నాయి. తుదకు అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించబడుతున్నాయి. గత 13 ఏళ్లలో తొలిసారి ఖతార్ నుంచి విమానం సిరియాలో ల్యాండ్ అవ్వడం గమనార్హం.
2011లో ప్రారంభమైన అంతర్యుద్ధంతో సిరియా తీవ్ర అవకతవకలకు లోనైంది. తిరుగుబాటుదారుల దాడుల కారణంగా, అప్పటి అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికార పగ్గాలను హయాత్ తహరీర్ అల్ షమ్ (HTS) అనుబంధ సంస్థ స్వాధీనం చేసుకుంది. విమానాశ్రయాలను మూసివేసి, దేశీయ విమానాలకు మాత్రమే పరిమితి విధించారు.
మంగళవారం, ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం సిరియాలోని డమాస్కస్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఖతార్ నుంచి సిరియాకు విమానం నడవడం 13 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
సిరియన్ ఎయిర్‌లైన్స్ కూడా తన కార్యకలాపాలను ప్రారంభించింది. డమాస్కస్ నుంచి యూఏఈలోని షార్జాకు 145 మంది ప్రయాణికులతో ప్రయాణించింది. వారానికి మూడు రోజులు సిరియాకు విమానాలు నడపనున్నట్లు ఖతార్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడంలో కీలకంగా మారనుంది.
సిరియాలో పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ విమాన సర్వీసుల పునరుద్ధరణ ఎంతో కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.