జాతీయం: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ప్రాణాంతక మంకీ పాక్స్ (ఎంపాక్స్) వ్యాధి భారత్‌లో తొలి కేసు నమోదైంది. ఒక యువకుడిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ యువకుడు వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చాడని, వెంటనే అతడిని ఐసోలేషన్‌లో ఉంచి, ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వెల్లడించారు. పరీక్షల కోసం నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
వైద్య నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించగా, వ్యాధి వ్యాప్తి మూలాలను తెలుసుకోవడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా కొనసాగుతోందని తెలిపారు. దేశంలో ఈ వ్యాధి ప్రభావంపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) ముందుగానే అంచనాలు వేసిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ వ్యాప్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18 వేలకుపైగా ఎంపాక్స్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. అలాగే, 926 మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన నివేదికల ప్రకారం, ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోంది. బురుండీ, రువాండా, కెన్యా, ఉగాండా వంటి దేశాలతో పాటు స్వీడన్, థాయ్‌లాండ్‌లో కూడా కొత్త కేసులు వెలుగుచూశాయి.
భారత్‌లో అప్రమత్తత
మంకీ పాక్స్ వ్యాధి విజృంభణ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త కేసులు నమోదైతే, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాధి తీవ్రత నివారణకు తగిన చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.