ఢిల్లీ: భారతదేశపు అత్యున్నత అధికారిక భవనమైన రాష్ట్రపతి భవన్‌లో ఒక ప్రైవేట్ వేడుక జరగనుంది. సాధారణంగా ఇది అధికారిక కార్యక్రమాలకు మాత్రమే వేదికగా ఉంటుంది. కానీ, ఈ నెల 12న సీఆర్ పీఎఫ్ అధికారులైన పూనమ్ గుప్తా, అవనీశ్ కుమార్ వివాహం అక్కడే జరగనుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేస్తున్న పూనమ్ గుప్తా ఈ ప్రత్యేక అనుమతిని పొందారు. వధూవరులిద్దరూ సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ లుగా పనిచేస్తుండడం విశేషం. పూనమ్ గుప్తా ప్రస్తుతం రాష్ట్రపతి భద్రతా బృందంలో సేవలు అందిస్తున్నారు.
ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా, రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి జరిపేందుకు రాష్ట్రపతి ముర్ము అనుమతి ఇచ్చారు.
ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్‌లో ప్రైవేట్ ఈవెంట్ జరగలేదు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమాలకే పరిమితమైన ప్రదేశం. అయినప్పటికీ, దేశ రక్షణకు సేవలందిస్తున్న అధికారుల వివాహానికి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ శుభకార్యం రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో జరగనుంది. ఈ ప్రత్యేక వివాహానికి సీఆర్ పీఎఫ్, ఇతర కేంద్ర బలగాల ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ వేడుక దేశ రక్షణలో ఉన్న అధికారులకు రాష్ట్రపతి భవన్ అందించే మరొక గుర్తింపుగా నిలవనుంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అనుమతులు ఉంటాయా అనే అంశంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.