టాలీవుడ్: పరిచయం అయిన మొదటి సినిమాతోనే తాను ఎలాంటి దర్శకుడు అనే విషయం ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తాను రూపొందించిన మొదటి సినిమా ‘అ!’ విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ లాంటి సూపర్ థ్రిల్లర్, ఈ మధ్య విడుదలైన ‘జాంబీ రెడ్డి’ సినిమాలతో ప్రశాంత్ వర్మ సినిమాల ఎంపిక ఎలా ఉంటుంది అని చెప్పవచ్చు. జాంబీ రెడ్డి సినిమాతో తెలుగులో మొదటి సారిగా జాంబీ సినిమా రూపొందించి రెకార్డ్ సృష్టించాడు. దేశంలో జాంబీ పైన చాలా అరుదుగా వచ్చిన సినిమాల్లో జాంబీ రెడ్డి మంచి గుర్తింపు తీసుకుంది.
ప్రస్తుతం ఈ డైరెక్టర్ మరొక సినిమా ప్రకటించాడు. మనం ఇంగ్లీష్ లో సూపర్ హీరో సినిమాలు చూస్తుంటాం. వాళ్ళందరూ కామిక్ బుక్స్ లో ఉన్న కారెక్టర్స్. బాలీవుడ్ లో క్రిష్ లాంటి ఫిక్షన్ కారెక్టర్ తో కూడా సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. తెలుగులో ఇంత వరకు సూపర్ హీరో సబ్జెక్టు తో సినిమా రాలేదు. ఈ సారి ప్రశాంత్ వర్మ తొలి తెలుగు సూపర్ హీరో సినిమాకి శ్రీకారం చూట్టాడు. కానీ ఈ సూపర్ హీరో ని కామిక్స్, ఫిక్షన్ కాకుండా మన ఇతిహాసాల నుండి తీసుకువస్తున్నాడు. రాముడి భక్తుడు హనుమాన్ కారెక్టర్ తో సూపర్ హీరో సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. తొలి తెలుగు ఒరిజినల్ సూపర్ హీరో మూవీ అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాలో నటించే నటుల వివరాలు, టెక్నిషియన్స్ వివరాలు ఇంకా ప్రకటించలేదు.