టాలీవుడ్: యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు నాగ శౌర్య నటిస్తున్న ఐదు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అందులో ‘వరుడు కావలెను’ అనే ఒక రొమాంటిక్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ కూడా ఉంది. లక్ష్మి సౌజన్య అనే నూతన దర్శకురాలు ఈ సినిమాని రూపొందిస్తుంది. పి.డి.వీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో పెద్ద సినిమాలు, ఇలా నాగ శౌర్య తో మీడియం రేంజ్ సినిమాలు తీసుకుంటూ బాలన్స్ చేస్తూ వెళ్తుంది ఈ నిర్మాణ సంస్థ.
‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’, ‘పడి పడి లేచే మనసు’ లాంటి సినిమాలకి సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ‘కోల కళ్ళే ఇలా’ అనే మొదటి పాట వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ అందించిన సూతింగ్ రొమాంటిక్ సాంగ్ కి గోశాల అందించిన సాహిత్యం తో ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో శౌర్య కి జోడీ గా రీతూ వర్మ నటిస్తుంది. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. మే లో ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.