న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ రెండవ వేవ్ వల్ల రికవరీ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు అంచనాలను 10 శాతానికి కుదిస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ సంస్థ వెల్లడించింది. క్రితంలో ఈ రేటు 12.8 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సెకండ్ వేవ్ వ్యాప్తి వల్ల బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు మరింతగా పెరిగాయని తాజాగా ఒక నివేదికలో తెలిపింది. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, క్రితం స్థాయికి పడిపోకుండా కాస్త ఊతం లభించిందని తెలిపింది. కాగా కీలకమైన పలు వ్యాపార కేంద్రాల్లో కార్యకలాపాలు దెబ్బతినడం వల్ల దేశంలో రికవరీ ప్రక్రియ నిదానించిందని ఫిచ్ తెలిపింది.
2019–20 ఆర్థిక సంవత్సరంలో 4 శాతంగా ఉన్న భారత వృద్ధి రేటు, కోవిడ్ మొదటి దశ వ్యాప్తి తరుణంలో 2020–21లో 7.3 శాతానికి పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండవచ్చని ముందుగా అంచనా వేసినా, కరోనా సెకండ్ వేవ్ రాకతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే తమ అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. మూడీస్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ మొదలైన అంతర్జాతీయ సంస్థలు కూడా ఇది 9.3 శాతం నుండి 9.5 శాతం దాకా ఉండవచ్చని భావిస్తున్నాయి. అటు ప్రపంచ బ్యాంకు ఏకంగా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి కుదించింది.