హైదరాబాద్: పాల్-వీ కంపెనీ నుంచి ఎగిరే కారు వచ్చేసింది, నెదర్లాండ్‌కు చెందిన పాల్–వీ అనే కంపెనీ తొలి కారును సిద్ధం చేసింది. యూరప్‌లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను పొందింది. ఇక ఇప్పుడు ఎవరైనా ఈ కారు కొనుక్కుని ఎంచక్కా ఎగిరేయొచ్చు.
ఎగిరే కారు ఆలోచనలు ఎప్పటినుంచో ఉన్నా కానీ ఈ కల ఇంత వరకు సాకారం కాలేదు. ఈ పాల్–వీ కారు తయారీ చేయడానికికి కూడా దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఈ ఎగిరే కారు పేరు ‘ది లిబర్టీ’. వాహనం బరువు తగ్గించేందుకు దీన్ని మూడు చక్రాలతోనే తయారు చేశారు.
నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే 3 చక్రాల వాహనానికి లైసెన్సు కూడా సులువుగా లభిస్తుందట. రోడ్డుపై వెళ్లేటప్పుడు ద లిబర్టీ రెక్కలు పైభాగంలో ముడుచుకుని ఉంటాయి. విమానంగా మారేటప్పుడు వాటి రెక్కలు విచ్చుకుంటాయి. 100 హెచ్‌పీ గల ఇంజిన్‌తో ఇది తొమ్మిది సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
కాగా ఈ ఎగిరే కారు లో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. గాలిలో ఎగిరేప్పుడు ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇక టేకాఫ్ కావాలంటే వెయ్యి అడుగుల రన్‌వే అవసరం కాగా, ల్యాండ్ అయ్యేందుకు వంద అడుగుల దారి సరిపోతుంది.
ఇంధన ట్యాంకులో వంద లీటర్ల ఇంధనాన్ని నింపుకొంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. అదనంగా మరో అరగంట పాటు నడిచేందుకు రిజర్వ్ ట్యాంకు కూడా ఉంది.