గినియా: పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ విషాదకర సంఘటనకు కారణమైంది. జెరెకొరెలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్ల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ 100మందికిపైగా ప్రాణాలు తీసింది.
రిఫరీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం అభిమానుల ఆగ్రహానికి కారణమవడంతో ఘర్షణ మొదలై రక్తపాతానికి దారితీసింది.
ఒక జట్టు అభిమానులు మైదానంలోకి చొచ్చుకురాగా, అవతలి జట్టు అభిమానులు ప్రతిదాడికి దిగారు. చిన్నతనంగా ప్రారంభమైన వివాదం క్షణాల్లోనే పెద్ద దాడులుగా మారి మైదానం పక్కన ఉన్న వీధుల్లో కూడా హింసాకాండకు దారితీసింది.
ఈ దాడుల వల్ల అనేక మంది గాయపడగా, స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఘర్షణల సమయంలో కొన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. సంఘటన స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికులను కలవరపెట్టింది.
ఈ ఘటనపై గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ్ విచారం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి హింసాకాండకు దారితీయకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
గినియాలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఘటన దేశ ప్రజలను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.