న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి విదితమే. అందువల్ల చాలా మంది విదేశీయులు భారత్‌లోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారి వీసా గడువును పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసకుంది.
భారత దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువును కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 31, 2021 వరకు పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది కూడా కేంద్రం భారత్ లో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు పెంచింది. మహమ్మారి కారణంగా సాధారణ కమర్షియల్ విమాన కార్యకలాపాలు 2020 మార్చి నుంచి రద్దయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందే చెల్లుబాటు అయ్యే భారతీయ వీసాలపై మన దేశానికి వచ్చిన అనేక మంది విదేశీ పౌరులు ఇండియాలో చిక్కుకుపోయారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజాగా మరో సారి ఇలాంటి సమస్య రావడంతో ఆగస్టు 31, 2021 వరకు ఎటువంటి ఓవర్‌స్టే పెనాల్టీ లేకుండా ఉచిత ప్రాతిపదికన దేశంలో చిక్కుకున్న వీదేశీయుల వీసా గడువును పొడగిస్తున్నట్లు కేంద్రం మరోసారి తన ఉత్తర్వుల ద్వారా తెలియజేసింది. ఇక విదేశీ పౌరులు తమ వీసా గడువు పొడిగింపు కోసం సంబంధిత ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ లేదా ఎఫ్‌ఆర్‌ఓకు ఎటువంటి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని కూడా ఈ ఉత్తర్వులలో తెలిపింది.
విదేశీ పౌరులు ఎవరైనా దేశం విడిచి వెళ్ళి పోయే ముందు సంబంధిత ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, ఎఫ్‌ఆర్‌ఓకు నిష్క్రమణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఓవర్‌స్టే జరిమానా విధించకుండా ఉచిత ప్రాతిపదికన మంజూరు చేయబడుతుంది అని కేంద్రం తెలిపి వారికి భారీ ఊరటను కలిగించింది.