‘‘జగనన్న క్షమించు, లోకేష్ అన్న వదిలేయ్!’’ అంటూ శ్రీరెడ్డి లేఖలు
వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన నేతలపై, వారి కుటుంబ సభ్యులపై తరచూ బూతులతో విరుచుకుపడిన శ్రీరెడ్డి ప్రస్తుతం వైసీపీ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అరెస్టుల నేపథ్యంలో, తన అరెస్టు కూడా తప్పదని భావించిన శ్రీరెడ్డి.. జగన్, లోకేష్‌లకు నేడు రెండు లేఖలు రాసింది.
- జగన్‌కు లేఖ: ‘‘జగనన్న, భారతమ్మకు నమస్కారాలు’’ అంటూ శ్రీరెడ్డి లేఖను ప్రారంభించింది. గతంలో వైసీపీకి అనుకూలంగా చేసిన విమర్శల వల్ల ఆ పార్టీకి, జగన్‌కు నష్టం కలిగిందని, తాను తనకు తెలియకుండానే తన వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా చేసానని అంగీకరించింది. పార్టీకి ఆమెపై వచ్చిన చెడ్డపేరు నష్టకరమని, అందుకే వైసీపీ కార్యకలాపాల నుంచి విరమించుకుంటానని స్పష్టం చేసింది. సాక్షి మీడియాలో పనిచేసినప్పటి నుంచి వైసీపీపై తనకున్న గౌరవం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది.
- లోకేష్‌కు లేఖ: ‘‘పుట్టింది గోదావరి జిల్లా, పెరిగింది విజయవాడ పరిసరాల్లోనే’’ అంటూ లోకేష్‌కి రాసిన లేఖను శ్రీరెడ్డి ‘ఎక్స్’లో (మాజీ ట్విట్టర్) పోస్ట్ చేసింది. ఇందులో తాను పుట్టింది గోదావరి జిల్లాలోనే అయినా పెరిగింది మాత్రం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అన్నారు.
అలాగే 95 శాతం మీ వాళ్లే నా ఫ్రెండ్స్ అన్నారు. తన తల్లితండ్రులు కూడా అక్కడే ఉంటారని, అమరావతి రావడం వల్ల వాళ్ల అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని టీడీపీకే ఓట్లు వేశారని గుర్తుచేశారు. మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచిగా ఉంటారని, అందుకే గత వీడియోలో తన కుటుంబ సభ్యులు తనచేత సారీ కూడా చెప్పించారన్నారు. అలాగే మీతో డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పారని, కానీ తనకు అంత స్థాయి లేక ఈ లెటర్ రాస్తున్నట్లు తెలిపారు.
తాను గతంలో టీడీపీ, జనసేన నేతలపై చేసిన విమర్శలకు క్షమాపణలు చెబుతూ, తన మాటలతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థం చేసుకున్నానని తెలిపింది. ‘‘వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి, తప్పుచేసినట్లు అంగీకరిస్తున్నాను’’ అంటూ లోకేష్, పవన్, చంద్రబాబు కుటుంబ సభ్యులందరికీ క్షమాపణలు తెలిపింది.
- ఆత్మపరిశీలన: తనపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు తనను తీవ్రంగా కుంగదీశాయని, ఆ వేదనతో గత వారం రోజులుగా ఆహారం కూడా తినలేకపోయానని చెప్పిన శ్రీరెడ్డి, ఇకపైనైనా తాను చేసే పని చక్కగా ఆలోచించి చేయాలనే ఆలోచనకు చేరుకున్నట్లు వివరించింది. తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చినా నా బుద్ధి వక్రమవుతుందని అనుకోవద్దన్నారు.
ఈ లేఖలు షేర్ కావడం ద్వారా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి వ్యక్తిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.