హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా, తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా చేర్చారు.
ఈ కేసులో నిధుల చెల్లింపులు నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయని ఆరోపణలతో ఈడీ చర్యలు ప్రారంభించింది.
ఈడీ, ఏసీబీ మధ్య డాక్యుమెంట్ల మార్పిడి కొనసాగుతుండగా, కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
హైకోర్టు ఈ నెల 30 వరకు ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసు నేపథ్యంలో, కేటీఆర్ ఈడీపై కూడా హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.