చెన్నై: ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు భారీ శుభవార్త. గతంలో కంటే తక్కువ ధరకే ఐఫోన్లు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఆపిల్ యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11ను చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో తయారు చేయడం ప్రారంభించింది.
ఆపిల్ ఐఫోన్11 మోడల్ ను తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేయనుంది. ఆపిల్ ఐఫోన్ల దేశీయంగా తయారు చేయడం ఎంతో లాభదాయకంగా ఉండనుంది.
భారత దేశ కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో మేకిన్ ఇండియాలో ఇదో కీలకమైన పురోగతి కానుంది అని ఆయన పేర్కొన్నారు. ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 11 తయారీని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటిసారిగా టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌ను తీసుకువస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్‌పోన్ అసెంబ్లింగ్ ప్రారంభించిన తొమ్మిది నెలల తర్వాత ఈ శుభ పరిణామం చోటు చేసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్ఫోన్లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నైలో తయారయ్యే ఐఫోన్ల ధరలు త్వరలో భారీగా దిగి రానున్నాయి.
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపిల్ స్మార్ట్ఫోన్లలో ఐఫోన్11 కూడా ఒకటి. మరోవైపు ఐఫోన్ ఎస్ఈ 2020ని బెంగళూరు సమీపంలోని విస్ట్రాన్ ప్లాంట్‌లో తయారు చేయాలని ఆపిల్ యోచిస్తోందని సమాచారం.