అమరావతి: రాష్ట్రంలో అర్హులైన రైతులందరి పొలాల్లోనూ ఉచితంగా బోర్లు వేయడంతో పాటు చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో బోర్లు వేయిస్తామని చెప్పామని, కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటారు కూడా ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.
మోటర్లు బిగించడానికి దాదాపు మరో రూ.1,600 కోట్లు అదనపు వ్యయం అవుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా అమలు చేస్తామన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, వారికి ఎప్పుడూ అన్యాయం చేయదని చెప్పారు. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని రైతులనుద్దేశించి ప్రసంగించారు.
రైతు కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, ఎన్నికల్లో ఇచ్చిన మరో మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాలు, మొత్తంగా 163 నియోజకవర్గాల్లో ఇవాళ బోరు యంత్రాలు ప్రారంభిస్తున్నాం. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లనే ఇది సాధ్యం అవుతోంది.
అందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల బోర్లు తవ్వడమే కాకుండా, వాటికి కేసింగ్ పైపులు కూడా వేస్తాం. ఈ పథకంపై వచ్చే 4 ఏళ్లలో రూ.2,340 కోట్లు ఖర్చు చేస్తామని గర్వంగా చెబుతున్నాము అని అన్నారు సీఎం జగన్.