హైదరాబాద్: తెలంగాణలోని 142 నగరాలు, మరియు పట్టణాల్లో ఉచిత తాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది గ్రేటర్ వరంగల్, ఖమ్మం, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటింటికీ నెలకు 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని అప్పట్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన విష యం తెలిసిందే. రాష్ట్రంలోని మిగిలిన పురపాలికల్లో సైతం ఈ పథకాన్ని భవిష్యత్తులో అమలు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొంది.
ఆ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇంటింటికీ నెలకు 20 వేల లీటర్ల లోపు తాగునీటిని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులతో పాటు విధివిధానాలను సైతం జారీ చేసింది.
రానున్న మార్చి లేదా ఏప్రిల్‌లో గ్రేటర్ వరంగల్, ఖమ్మం సహా తొమ్మిది పురపాలికలకు మలి విడత ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ ఎన్నికలు ముగిశాక జీహెచ్‌ఎంసీ తరహా మిగతా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశాలున్నట్లు పురపాలక శాఖ వర్గాలు భావిస్తున్నాయి.