ఏపీ: కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌పై చర్చలు వేడెక్కుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ క్షీణిస్తున్నదనే విమర్శల మధ్య, ప్రస్తుత పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడం, అక్కడ నామమాత్రపు సీట్లు దక్కడం ఏపీ కాంగ్రెస్‌ను ఆత్మవిమర్శకు ప్రేరేపించింది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పూర్తిగా క్షీణించిందని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. ప్రస్తుతం, క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు సంపాదించడం అనేది పార్టీ ఎదగడానికి కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల పార్టీని ముందుకు నడిపించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆమె వ్యక్తిగత అజెండాతో ముందుకు సాగడం, పార్టీ మొత్తం అందరిని కలుపుకుని ముందుకు వెళ్లడంలో విఫలమవుతున్నారని సీనియర్ నేతలు చెబుతున్నారు. జగన్ పైనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.
ఇటీవలి ఎన్నికల తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌కు ఉపయోగపడలేదు. ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో, వారి నమ్మకాన్ని గెలుచుకోవడంలో పార్టీ వెనుకబడిందని మాజీ నేత రఘువీరా రెడ్డి తెలిపారు.
మహారాష్ట్రలో పార్టీ పరాజయం చూస్తే, ఏపీలో పరిస్థితి ఇంకా గణనీయమైన మార్పులు అవసరమని వ్యాఖ్యానించారు.
సీనియర్ నాయకులు సూచించినట్లుగా, పార్టీని పునరుజ్జీవించాలంటే క్షేత్రస్థాయిలో మార్పులు చేయడం, భిన్న వర్గాలను సమీకరించడం, ప్రజా సమస్యలపై స్పందించేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఇదే సమయంలో, షర్మిల కూడా తన అజెండాను పక్కన పెట్టి, నాయకత్వం లో కసరత్తు చేయాల్సి ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ మరింత క్షీణించి రాజకీయ రంగంలో నామమాత్రమైన పాత్రకే పరిమితం అవుతుందనే హెచ్చరికలు వస్తున్నాయి.